Kcdf round table 7.2.26


కడప నగరంలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలి 

        ___ KCDF రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల డిమాండ్


         కడప నగరాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఆ వేదిక కన్వీనర్ పీ.వి. కుమారస్వామి రెడ్డి  అధ్యక్షతన జరిగింది.‌ ఆయన మాట్లాడుతూ కడప అభివృద్ధి వేదికకు కుమార స్వామి రెడ్డి కన్వీనర్ గా రామకృష్ణారెడ్డి కోకన్వీనర్ గా ఏర్పడిందన్నారు. కడప నగరంలో ఉన్న వివిధ సమస్యల పైన నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాల పైన చర్చించడానికి నగరంలో ఉన్న మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు స్వచ్ఛంద సంస్థలు ఇతర సామాజిక సేవా భావం కలిగిన వారందరినీ ఆహ్వానించామన్నారు. కడప నగరం ఏర్పడి 20 ఏళ్లకు పైగా అయినా ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని అన్నారు అభివృద్ధి అసలు ఊసే లేదని అన్నారు. నగరం చాలా విస్తరించినా పార్కులు రెండు మాత్రమే ఉన్నాయని, ఇంకా చాలా పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మంచినీరు అరకొరగా వస్తుందని స్వచ్చమైన నీరు అన్ని ప్రాంతాల వారికి అందించాలని అన్నారు. ఇంకా ఇతర అంశాల పైన చర్చించడానికి వివిధ రంగాలలో ఉన్న వారందరినీ ఆహ్వానించినట్లు చెప్పారు. 


     కో కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విలీన ప్రాంతాలలో వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోతున్నాయని అండర్ డ్రైనేజీ స్కీము నిరుపయోగంగా ఉందని అన్నారు. పేద పిల్లలు రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

      రిటైర్డ్ ఎంఈఓ నాగముని రెడ్డి మాట్లాడుతూ నగర సమస్యలు చాలా పెరిగాయన్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ లో అవినీతి బాగా పెరిగిందని అన్నారు. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మారింది తప్ప ప్రజలకు మేలు చేకూర్చేతగా ప్రణాళికలు లేవని అన్నారు. ఇందుకోసం వేదికకు కావలసినంత సహాయ సహకారాలు అందిస్తామని వేదిక ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని అందరూ కలిసికట్టుగా రావాలని కోరారు. నీళ్లను ఇంకా రోజు ఇవ్వలేకపోతున్నారని రోజు మార్చి రోజు ఇవ్వడం ద్వారా అది కూడా అర్ధరాత్రి పూట ఇవ్వడం ద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. 

      కవి రచయిత రాజారెడ్డి మాట్లాడుతూ విశ్వనాధపురం లో 300 ఇల్లు ఉన్న కాలనీలో రోడ్లు ఇంకా ఏర్పాటు చేయడం లేదని అక్కడ దగ్గరలో ఉన్న కళ్యాణమండపం దగ్గర నీళ్లు నిలిచి ప్రజలకు ఇబ్బందిగా ఉందని దానివల్ల దోమలు పెరుగుతున్నాయని అన్నారు ఎర్రముక్కపల్లి లో ఫుట్పాత్ పైన అనేక అంగళ్లు వెలిసి రోడ్డు ను చిన్నదిగా చేస్తున్నాయని దీని నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. 

   ప్రముఖ సంఘ సేవకులు సలావుద్దీన్ మాట్లాడుతూ రోడ్లంతా గుంతల మాయమై అనేకమంది యాక్సిడెంట్లకు గురవుతున్నారని ఆ గుంతలను పూడ్చే కార్యక్రమం కూడా మున్సిపాలిటీ చేయకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రీ జోన్ గా కడప మున్సిపాలిటీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిర్మలాదేవి మాట్లాడుతూ దీనివలన పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుందని ఏదైనా సమస్యలు ఉంటే మున్సిపాలిటీ నే కాకుండా డిస్టిక్ లీగల్ అథారిటీకి ఇస్తే వాళ్ళు తగు విధంగా ఆదేశాలు ఇస్తారని కూడా సలహా ఇచ్చారు. 

     ప్రముఖ ప్రజా సేవకుడు గౌస్ పీర్ మాట్లాడుతూ రాజకీయ నాయకుల జోక్యంతోనే పనులు జరుగుతున్నాయని, అధికారులు రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగిపోతున్నారని అన్నారు ఎస్బిఐ కాలనీలో రోడ్లు లేవని అన్ని గుంతల మయమై వర్షాకాలంలో అవి వంకలుగా మారిపోతున్నాయని అన్నారు దస్తగిరి పేట స్మశానం నీళ్లలో మునిగిపోతోందని అన్నారు. శవాలను అందులో ఎలా పూడుస్తారని ఆయన  ప్రశ్నించారు అంబేద్కర్ భవనం కళాక్షేత్రం వంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ భవనాలను ప్రజల కోసం కాకుండా వాటిని పెట్టుబడిదారులకు ఇచ్చి వ్యాపారం చేయాలని చూస్తోందని ఇది సరైంది కాదని వాటిని అభివృద్ధిపరిచి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. 

చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెన్నా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని వేసవికాలంలో అందరికీ మంచినీళ్లును సరఫరా చేయొచ్చని అన్నారు. రాజకీయ నాయకులు ఇందులో ప్రవేశించకుండా కేవలం సమస్యల మీదనే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

      మాజీ కార్పొరేటర్ హరి నారాయణ మాట్లాడుతూ నగరావృద్వికి అందర్నీ భాగస్వాములు చేయడం మంచిదన్నారు మున్సిపాలిటీ 17 కాంప్లెక్స్ కట్టి ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉందన్నారు 166 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అందులో 130 ఎకరాలు అన్యాక్రాంతం అయిందని అన్నారు ఇంకా ఇప్పటికి 30 ఎకరాలు మిగిలి ఉందని దానిని జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉందని దానిని ప్రజలకు సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

       రిటైర్డ్ అధికారి వీరబ్రహ్మం మాట్లాడుతూ విశ్వనాధపురం రైల్వే బ్రిడ్జి పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఇది విద్యార్థులకు గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. దీని పూర్తి  చేయకపోతే తాను ఆమరణ నిరాహారదీక్షకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.‌ కొమ్మలపాటి దివాకర్ మాట్లాడుతూ రాజీవ్ పార్క్ దగ్గర ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉందని స్లమ్స్ డెవలప్మెంట్ చేయకుండా ఉన్నారని డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని అన్నారు. లక్ష్మీదేవి మాట్లాడుతూ పారంపల్లె మొదలైన చోట్ల చాలా సమస్యలు ఉన్నాయని కరెంటు స్థలం ఒరిగి ఉంది రేషన్ కార్డు లేవు వితంతువులకు పెన్షన్లు చెల్లించడం లేదు ఇవన్నీ కూడా సమస్యలేనని ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. వాసు మాట్లాడుతూ పాత బస్టాండు కూలిపోయే దశలో ఉందని ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయని అన్నారు ప్రకృతి నగర్ దగ్గర రైల్వే బ్రిడ్జి దగ్గర చాలా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు స్వచ్ఛంద సేవ నాయకులు వేణుగోపాల్ మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చాలా ఏళ్లు అయిందని దాన్ని వినియోగంలోకి తీసుకు రాలేదని అన్నారు. దాంట్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని  అన్నారు. గౌస్ నగర్ లో బీడీ కార్మికులు అధికంగా ఉన్నారని వారికి లంగ్స్ వ్యాధులు లాంటివి వస్తున్నాయని అన్నారు కట్టకింద హరిజనవాడలో సౌకర్యాలు కల్పించలేదని అన్నారు కమ్యూనిటీ టాయిలెట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు పార్కులను అభివృద్ధి చేయడం లేదని అన్నారు 

        మల్లెల భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో నిర్వచించాలని అన్నారు.కడప సిటీలో పబ్లిక్  ట్రాన్స్పోర్టేషన్ సిస్టం లేదని సిటీ బస్సులు లేవని అన్నారు. సంపులో వాటర్ను నింపి అవేమి క్లీన్ చేయకుండా ఉన్నందువల్ల అవి దుర్వాసనతో ఉన్నాయని అన్నారు . నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు నాగరాజు పేటలో డ్రైనేజీ నీరు వాటర్ పైప్ లైన్లు,నీరు రెండు కలిసి విషపూరిత నీటిని సరఫరా చేస్తుందని అన్నారు రోడ్లు లేవు కాలువలు స్మశానవాటికలు అసలు లేవని ఇది పెద్ద సమస్య అని అన్నారు పసిపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆస్పత్రులు మున్సిపల్ ఏరియాలో నిర్మించాలని అన్నారు విలువైన భూములను పాఠశాలలకు ఆరోగ్యానికి కేటాయించాలని అన్నారు రాజకీయ పార్టీలకు కేటాయించడం సరైనది కాదు అని అన్నారు 

వచ్చే వేసవికాలంలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుందని దాన్ని ఎప్పటినుంచే ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలని శివరామ్ అన్నారు. దోమలు  పెరిగిపోతున్నాయని, దాన్ని నివారించాలని ఆయన అన్నారు 

       కడప నగరంలో దాదాపు నాలుగు లక్షల జనాభా ఉందని అందులో 70000 కుటుంబాలు ఉన్నాయని లక్షకు పైగా వీధులు ఉన్నాయని సిఐటియు నాయకులు మనోహర్ అన్నారు. సింగపూర్ ఎస్బిఐ కాలనీ కోఆపరేటివ్ కాలనీ వంటి మధ్యతరగతి నివసించే ప్రదేశాలలో అపార్ట్మెంట్లో ఎక్కువగా వచ్చాయని అన్నారు. ప్రజల అవసరాలను మున్సిపల్ యంత్రాంగం తీర్చడం లేదని విమర్శించారు.  కడప నగర అభివృద్ధి కోసం ప్రతిపాదనను చేపట్టాలని అన్నారు. 

     కెవిపిఎస్ నాయకులు నరసింహ మాట్లాడుతూ బయట నుంచి వచ్చే ప్రజలు స్థానిక ప్రజలు టాయిలెట్స్ కోసం హాస్పిటల్స్ ను వెతుక్కుంటున్నారని అన్నారు చాలా వాటిని మరుగుదొడ్లను లాక్ చేశారని వాటిని బాగు చేసి వినియోగంలోకి తేవాలని అన్నారు .అమృత్  స్కీం కింద మంచినీళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని దాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు మంచినీళ్లు అందించాలని అన్నారు గంజాయి మత్తులో పడిన యువతకు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

  ఈ సమావేశంలో వెలుగులోకి వచ్చిన సమస్యలను క్రోడీకరించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన అవసరం సమావేశంలో పాల్గొన్న అందరూ ముక్తకంఠంతో  కోరారు.



Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022