Posts

Showing posts from February, 2025

వద్దొద్దు తరలింపు

వద్దొద్దు తరలింపు రాయలసీమ గుండె తడి రాజకీయ నీలి మేఘానికి తెలుస్తుందా? రాజధాని ఆశ ఎటూ పాయె! ఉన్నత న్యాయం కను చూపు మేరలో కానరాలే బెంచి బెంచి అంటూ అరిచి ఏ బెంచీ లేని లేని చోట  ఏమీ పాలు పోక దిక్కులు చూస్తున్నాము మన కలల బడిలో  ఏ అక్షరాల ప్రగతీ లేదు. కురిసే చినుకు మాటుకు పోతే ఉన్న ఆఫీసులన్నీ రాజధాని వైపు అడుగులేస్తే నైపుణ్య కేంద్రాలు అదే బాట పడితే సీమ గోడు వినేవాళ్లు ఎవరూ! యువత కాళ్ళను ఉక్కుమయం చేస్తారని  ఆధునిక దేవలాల లో ఆనందపు గంటలు మ్రోగుతాయని ఎదురుచూస్తున్న వేళ  బ్రతుకు ఎండమావిగా మారుతుంటే ఇది అవకాశం పంచే ప్రభుత్వమా? అవకాశాల్ని తినే రాబందుల రాజ్యమా? సీమ మన్ను తడిపే కన్నీటి చుక్క  నీతి మరిచే పాలకులకు తెలుస్తుందా? ఆవేదన రగిలి రగిలి  సీమ గుండెలో నిప్పుల వేడి చెలరేగుతుంది కవి గుండెలలో ఎగసే కవితా తుఫాను తీరం దాటక ముందే  పీఠాలను కబలిస్తుంది  అభివృద్ధన్నది ఒక ప్రాంతానికి కాదు అది ఎల్లలెరుగని  సమానత్వ భావన అదే లేని నాడు అక్షరం నిప్పులు చిమ్ముకుంటూ అధికారాన్ని దహించడం ఖాయం. ___ పిళ్లా‌ కుమారస్వామి,9490122229

ఈ నేల నిశ్శబ్దంగా ఉంది

ఈ నేల నిశ్శబ్దంగా ఉంది  ఇక్కడి నేలలో పారే నీళ్లు ఎక్కడో ఇంకుతున్నాయి ! ఇక్కడి చెమట ధారలు ఎక్కడో ఆవిరవుతున్నాయి ! ఇక్కడి పౌరుషాలు వట్టి ప్రగల్పాలుగా మారి ఎక్కడో సమాధుల్లోకి చేరుతున్నాయి.  ఈనేల ఎందుకో నిశ్శబ్దంగా ఉంది.. చీకటి పొరల్లో నిద్రపోయిన కథలా! ఒక్కొక్క గొంతుక విచ్చుకుంటే అప్పుడది రణన్నిదానంగా మారుతుందేమో   గనులు కొల్లగొట్టారు పారుతున్న నీళ్లను ఒడిసిపట్టలేకపోయారు  నేల నమ్ముతున్నారు   నెర్రలవుతున్న నేలను మాగాణం చేయలేకపోయారు. ఇక్కడి బ్రతుకులు జీవచ్ఛావాలు   ఆశలనింపి హక్కులను తట్టి లేపే నినాదం ఎప్పుడందుకుంటుందో.  ఎవడో వస్తాడని ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూస్తూన్న కనులు  కళ్లెర్ర చేసేదెన్నడో... నూరు టీఎంసీలు కావాలని ఒకవైపు  దశాబ్దానికోసారి పారే  సెలయేటిని ఒడిసిపట్టమని కోరుతున్న గొంతుకలు మరో వైపు ఖాళీ చేతులకు పనులిమ్మని ఆధునిక దేవలాలను నిర్మించమని అడిగే  వెలుగు నిప్పులు కురిపించే గొంతుకలు ఎప్పుడు గర్జిస్తాయో? ఈ మౌనం ఎప్పుడు విరగబడి జలధారలై ప్రవహిస్తుందో? ____ పిళ్లా కుమారస్వామి,9490122229