కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై మోడీ స్పందించాలి.

*కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై మోడీ స్పందించాలి.* 

కడప అంబేద్కర్ సర్కిల్ లో సిపిఎం నిరసన. 

అమరావతి పర్యటన సందర్భంగా వెలగపూడి లో పర్యటించనున్న నరేంద్ర మోడీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పందించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామమోహన్ విజ్ఞప్తి చేశారు. 

శుక్రవారం నాడు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో *అమరావతి పర్యటన సందర్భంగా మోడీ కడప ఉక్కు నిర్మాణంపై స్పందించాలని* డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ విభజన చట్టంలో స్పష్టంగా కడప ఉక్కు నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. 

ఈ నేపథ్యంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. 

గతంలో కడప జిల్లా పరిషత్తు ఆవరణలో టిడిపి నేతలు ఉక్కు దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన కూటమినేతలు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఏడాది గడిస్తున్న ఇంకా స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. 

రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగం, కరువు విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతుందన్నారు. 

ఈ సమస్య పరిష్కారానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కీలకమైందని ఆయన పేర్కొన్నారు. 

ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 

కడప జిల్లాలో శంకుస్థాపనల ఉక్కు ఫ్యాక్టరీ కావాలని అనుకోవడం లేదని, నిర్మాణం పూర్తి చేసి ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని జిల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు. 

తక్షణమే కూటమినేతలు నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గట్టిగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాకపోతే కూటమినేతలే జిల్లా ప్రజానీకానికి ద్రోహం చేసిన వారు అవుతారని ఆయన అన్నారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకునే ధోరణి కొనసాగుతున్నప్పుడే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. 

లేని పక్షంలో ప్రజా ఉద్యమాలను చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరి రెడ్డి, శ్రీనివాసులరెడ్డి నగర కమిటీ సభ్యులు చంద్రరెడ్డి, కుమారస్వామి రెడ్డి, నారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకట సుబ్బయ్య, హరిచంద్ర రెడ్డి, సాంబ శివారెడ్డి, నరసింహ, గోవిందు, తిమ్మయ్య, సరిత, జార్జి, శేఖర్, రసూల్, ఉదయ్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం