రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యం పై లిటరరీ ఫోరం

రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యం పై లిటరరీ ఫోరం

        కేంద్ర సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్తంగా రాహుల్ సాంకృత్యాయన్ రచనలపై 6.11.22, ఆదివారం నాడు సాహిత్య సమావేశాన్ని స్థానిక యు. టి. ఎఫ్. భవనంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఈయన మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ తన జీవితమంతా పర్యటిస్తూ భారత దేశ సామాజిక సాంస్కృతిక వారసత్వాన్ని తన రచనల్లో శాస్త్రీయంగా పొందుపరిచారన్నారు. ఆయన భారతీయ ఆత్మను తన రచనల ద్వారా తెలియజేశారన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డా. కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ దాదాపు 40భాషల్లో ప్రావీణ్యత కలిగిన పండితుడని, ఆయన 140 పైగా రకరకాల సాహిత్యాన్ని మనకందించి వెళ్లాడని అన్నారు. ఆయన జీవితమంతా పర్యటిస్తూ ఆయన అనుభవాల ద్వారా అనేక నవలలు,కథలు, వ్యాసాలు, ట్రావెలాగ్  వంటివి రాశాడని అన్నారు. ఆయన బౌద్ధం స్వీకరించి బౌద్ధం పై అనేక గ్రంథాలు రాశాడని అన్నారు. ఆయన నిజంగా భారతీయ మేధావుల్లో ఒకరని కొనియాడారు.
       కడప సాహితీ స్రవంతి కన్వీనర్ బండి ప్రసాద్ మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ రచనలపై సాహిత్య అకాడమీ సహకారంతో ఈ సదస్సు ను నిర్వహిస్తున్నామని చెపుతూ వక్తలను వేదిక పైకి ఆహ్వానించారు.
         డా. ఓబుల్ రెడ్డి ఓల్గా నుంచి గంగకు గురించి దృశ్య రూపకంగా వివరిస్తూ రాహుల్ సాంకృత్యాయన్ అనేక కథలు ద్వారా భారత దేశ చరిత్ర ను వివరించారని అన్నారు. ఆర్యులు ఇరాన్ నుంచి రష్యా నుంచి వలస వచ్చారన్న విషయాన్ని వారి భాష, పురావస్తు ఆధారాలు, వేదసాహిత్యం, మొదలైన వాటి ద్వారా రాహుల్ సాంకృత్యాయన్ నిరూపించారన్నారు. ఇంత ఆధునికంగా చెప్పిన రచయిత ఇంత వరకు లేడన్నారు. ఆయన నిరంతర సత్యాన్వేషని అన్నారు.రాహుల్ ఓల్గా నుంచి గంగకు అనే కథనాత్మక నవల రాశారు. ఇందులో చరిత్ర కూడా ఉంది. ఓల్గా నది రష్యాలో ఉంది. గంగా నది భారతదేశంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలను కలపడానికి కారణం ఆనాటి ప్రజల వలసలే కారణం. ఆర్యులు ఓల్గా నదీతీరాల వెంబడి పయనిస్తూ గంగానది పరీవాహక ప్రాంతాల్లోకి ఏవిధంగా స్థిరపడ్డారో ఇందులో కథలు ద్వారా రాహుల్ వివరించారని డా. ఓబుల్ రెడ్డి సభికులకు  దృశ్య రూపకంగా ప్రొజెక్టర్ సహాయంతో చెప్పారు.
       తరువాత వక్త మాజీ ఎం.ఎల్.సి. డా. గేయానంద్ విస్తృత యాత్రికుడు నవల గురించి మాట్లాడారు.ఇది ఒక నవలని, అందులో నరేంద్రుడనే ఒక వ్యక్తి ని గురించి చెప్పినా అది అతని స్వంత కథే నని అది అతని ప్రస్థానాన్ని తెలియజేస్తుందని అన్నారు. విస్తృత యాత్రికుడు నవలను రాహుల్ వాస్తవానికి చరిత్ర గా రాయడానికి ప్రయత్నించాడన్నారు. ఇందులో క్రీ.పూ.5,6 శతాబ్దపు కాలంనాటి పరిస్థితులు వర్ణించాడన్నారు.ఇది చరిత్రనా,నవలనా అన్నంత గా ఆయన తీర్చిదిద్దాడన్నారు.  దీని పై మరింత పరిశోధన అవసరమన్నారు.
           డా.వినోదీని రాహుల్ సాంకృత్యాయన్ రాసిన లోకసంచారి నవలను సోదాహరణంగా వివరించారు. ఇందులో రాహుల్ తాత్విక దృక్పథం ప్రస్పుటంగా కనిపిస్తుందన్నారు. ఆయన మహిళలు కూడా లోకసంచారులు కావచ్చని అన్నారు. అయితే వారికి ప్రకృతి ధర్మాలు, పురుషులు అడ్డుగా ఉంటాయన్నారు. పీడితుల పక్షాన నిలబడి ఆయన పోరాడాడు.దేశ సంచారి ఎలా ఉండాలో ఏ విధంగా కష్టపడాలో వివరంగా ఇందులో చెప్పారన్నారు. 
         దాదాహయత్ రాహుల్ సాంకృత్యాయన్ కథాసాహిత్యం పై వివరంగా చెప్పారు. ఓల్గానుంచి గంగకు,మధుపురి అన్నీ కథలే నని  అవి కథలా చరిత్రనా అని చెప్పలేనంత గా ఆయన రాశాడన్నారు.మొత్తం మీద ఆయన నవలు, కథలు రాశాడన్నారు. బౌద్ధం, అంబేద్కర్,గాంధీపై మంచి అభిప్రాయాలను వ్యక్తం చేశాడని కవులు భాస్కర్, సురేష్ బాబు, స్వతంత్ర బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగివేమన తెలుగు ప్రొఫెసర్ డా. ఈశ్వర్ రెడ్డి, స్వచ్చందసేవకులు శివారెడ్డి, సామాజిక కార్యకర్తలు  నారాయణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం