సాహిత్యం కోసం చేసిన కృషి

గత 18 సంవత్సరాలుగా తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి నిర్వహించాను .గురజాడ జయంతి ,జాషువా శ్రీ శ్రీ  వర్ధం తులు క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాను. సాహితీ స్రవంతి సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ,అధ్యక్షునిగా ,జిల్లా గౌరవ అధ్యక్షులు గా ఉండి జిల్లా  సాహిత్య సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి కి కృషి చేశాను. ప్రపంచీకరణలో తెలుగు భాష ఉన్నత మధ్య తరగతి వర్గం లో కనుమరుగవుతోందన్న యునెస్కో నివేదికను గుర్తించిన తర్వాత తెలుగు భాష పరిరక్షణ అవసరమని భావించి తెలుగు భాషా పండితుల కోసం  కవిత్వం కథ వ్యాసరచన పోటీలు నిర్వహించి వారిలో సాహిత్యాభిలాష తెలుగు భాషాభివృద్ధిలో  వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కృషి చేశాను. అదే విధంగానే విద్యార్థులకోసం అనేక కథ కవిత్వం వ్యాసరచన సాహిత్య పోటీలు పెట్టి బహుమతులు అందించాను.ఇలాంటి కృషి  ఫలితం గా ఈరోజు జిల్లాలో  సాహిత్య రంగంలో ఏర్పడిన స్తబ్ధత బ్రద్దలై అనేక సాహిత్య సంఘాలు ఏర్పడి భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అదే సందర్భంలోనే చాలా మంది కొత్త కవులు రచయితలు వెలుగులోకి వచ్చారు. ఇంకా  చాలామంది యువకులు తెలుగు సాహిత్య రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూనే అనేక రచనలు చేయడానికి కూడా సంకల్పించాను .కవిత్వం , కథలు ,సాహిత్య విమర్శా వ్యాసాలు  రాశాను .  2015లో వేమన సాహిత్య సమాలోచన సదస్సును అనంతపురంలో అనేక సాహిత్య సంఘాలను కలుపుకొని నిర్వహించాను. జిల్లాలో అనంతపురం , ఉరవకొండ, హిందూపురం కదిరి ,రాయదుర్గం మొదలైన ప్రాంతాలలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడానికి సాహితీ పరులు అందరిని ఒక వేదిక మీదికి రావడానికి ప్రయత్నం చేశాను. కదిరి ప్రాంతంలో ఉగాది కవిసమ్మేళనాలు, ఇప్పుడు వీస్తున్న గాలి పేరుతో జిల్లాలోని సాహిత్యకారుల రచనలపై నెలల ఒక కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు నిర్వహించాను. అనంతపురంలో వర్తమాన సాహితీ తరంగాలు పేరుతో అనంతపురం జిల్లా లో పేరొందిన కవుల రచనలన్నింటిపై సాహిత్య విమర్శా కార్యక్రమాలు నిర్వహించాను.మట్టి పోగు అనే కవితా సంపుటిని రాసి ప్రచురించాను. అనంత కవితా స్వరాలు అనే కవితా సంకలనాన్ని జిల్లాలోని వర్తమాన కవులందరి సహకారంతో ప్రచురించాను. రాయలసీమలో సాహిత్య ప్రస్థానం , అనంత సాహిత్య ప్రస్థానం అనే పుస్తకాలను రాసి ప్రచురించాను .కదిరీపతి రాసిన కావ్యం ఆధారంగా శుకసప్తతి కథలు ప్రచురించాను .ఇలా తెలుగు భాషను కాపాడడానికి తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఒకవైపు నా వృత్తిని, ప్రవృత్తి ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను.

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు